కెనాల్ కొల్లగొడుతున్నా కదలని అధికారులు…
ప్రభుత్వ ఆస్తులకే రక్షణ కరువైందా…?
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో జూరాల కెనాల్ నుంచి మట్టి అక్రమ తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మల్లాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న కెనాల్‌కు గండి కొట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కెనాల్ నుంచి మట్టిని అక్రమంగా తరలించడం వల్ల కాలువకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఆత్మకూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోనూ మట్టి రవాణా విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెనాల్ నుంచి మట్టిని తరలించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారు? కెనాల్‌కు గండి కొట్టి మట్టి తవ్వకాలు చేపడుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తూ సాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అక్రమ మట్టి తరలింపుపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని పట్టణవాసులు కోరుతున్నారు. కెనాల్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్రమ తవ్వకాలు, మట్టి రవాణాను అరికట్టడంతో పాటు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

