ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. PDSU జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-
ఇంటర్మీడియట్ బోర్డు రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పీడీఎస్‌యూ (PDSU) జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ప్రతిభ పారామెడికల్ కళాశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు నిర్ణయం విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇంటర్మీడియట్ విద్య అనేది విద్యార్థుల ఉన్నత విద్యకు కీలకమైన దశ అని, ఇలాంటి కీలకమైన విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే ముందు ప్రభుత్వం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం సమంజసం కాదన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదని హితవు పలికారు. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని, విద్యార్థుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో కే. మనోజ్ కుమార్, అవినాష్, శివరామ్, చరణ్, తిరుమలేష్, శివ, అనిల్, అనుక్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

