శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శకత్వంలోనే పనులు.. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఒక్క అడుగు కూడా వేయలేదు
ఆలయ అభివృద్ధిపై అసత్య ప్రచారాలను నమ్మొద్దు.. భక్తులకు వాస్తవాలు వివరించడమే మా బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ 20: రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అవసరమైతే ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయ అభివృద్ధి తమ ఏకైక లక్ష్యమని, భక్తుల మనోభావాలు, ఆలయ ప్రాచీనత, ఆగమ సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామివారి సూచనలు, అనుమతులు, మార్గదర్శకత్వంలోనే అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
వేములవాడలో ఓకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజన్న ఆలయ అభివృద్ధిలో ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకు తావులేదన్నారు. ఆలయ నిర్మాణాలకు సంబంధించి ప్రతి అంశాన్ని శాస్త్రోక్తంగా, ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆలయ అభివృద్ధిపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను భక్తులు విశ్వసించవద్దని కోరారు. ఎవరికైనా సందేహాలుంటే నేరుగా అడిగి తెలుసుకోవాలని, అన్ని వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రధాన ఆలయ శిఖరం విషయంలో వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. గతంలో శిలామయంగా ఉన్న శిఖరాన్ని 1970వ దశకంలో తొలగించి ఇటుకలతో నిర్మించినట్లు శృంగేరి పీఠంలో జరిగిన చర్చల సందర్భంగా వెల్లడైందన్నారు. పీఠాధిపతుల సూచన మేరకు తిరిగి శిలామయమైన పంచతల విమాన గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు 12-08-2026న శృంగేరి పీఠం నుంచి అనుమతి, శ్రీముఖం లభించిందని పేర్కొన్నారు.ఆలయ ప్రధాన అర్చకులు, ఇన్ఛార్జి స్థానాచార్యులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నవంబరు 1న ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య కళాపకర్షణ, కలశ సంబంధిత పూజలను ఆగమ శాస్త్ర విధానంలో నిర్వహించిన అనంతరమే పనులు ప్రారంభించామని వివరించారు. కళాపకర్షణ లేకుండానే నిర్మాణ పనులు చేపట్టారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. నవంబరు 16న కార్తీక శుద్ధ సప్తమి, శ్రవణ నక్షత్ర యుక్త శుభ ముహూర్తంలో శృంగేరి ఉభయ జగద్గురువుల సూచనల మేరకు శిఖరంపై ఉన్న కలశాన్ని శాస్త్రోక్తంగా తొలగించి గర్భాలయంలో ధాన్యాధివాసం నిర్వహించినట్లు తెలిపారు.అభివృద్ధి పనుల వల్ల భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు సహా అన్ని రకాల ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రధాన ఆలయంలో స్వామివారి నిత్య పూజలు, అర్చనలు, కైంకర్యాలు ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.ఆలయ అభివృద్ధి పనులు ఆగమ, శిల్పశాస్త్ర నిపుణులు, ప్రభుత్వ సలహాదారులు, VTADA, దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెప్పారు. మోతీలాల్ స్థపతి, శివనాగి రెడ్డి స్థపతులను ప్రభుత్వం సీనియర్ కన్సల్టెంట్ స్థపతులుగా నియమించిందని, వారి సూచనలు, సలహాలతో ఆలయ నిర్మాణశైలి, శిల్ప సంప్రదాయాలు, క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపడుతున్నామని వివరించారు. సుమారు రూ.250 కోట్లతో ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన సౌకర్యాలు మెరుగుపరచడం, ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడం,మౌలిక వసతులు కల్పించడం లక్ష్యమన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. వేములవాడ రాజన్న ఆలయానికి రూ.500 కోట్లు మంజూరు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి, అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ధర్మపురి, కొండగట్టు, భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. దేవాలయాల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. వేములవాడ, భద్రాచలం, కాళేశ్వరం, బాసరతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.రాజన్న ఆలయ అభివృద్ధి అనేది కేవలం నిర్మాణాలకే పరిమితం కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయ పవిత్రతకు, ప్రాచీనతకు, సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే రాజన్న క్షేత్ర వైభవమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

