మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
వైద్య రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన చికిత్సా విధానాలను వైద్య విద్యార్థులు, యువ వైద్యులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి, మమత వైద్య విద్యాసంస్థల అధినేత పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ధితోనే వైద్య రంగంలో మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని అన్నారు. ఖమ్మం జిల్లా మమత మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో సాల్వింగ్ ది అన్సాల్వ్డ్(పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం) అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఆర్థోపెడిక్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ)గా పిలిచే సదస్సులు ప్రస్తుతం కంటిన్యూయస్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ (సీపీడీ)గా రూపాంతరం చెందాయని, పేరు ఏదైనా వైద్యులకు నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్లలో ఎదురయ్యే అనూహ్యమైన క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ప్రస్తుతం ఆర్థోపెడిక్స్ విభాగంలో రోబోటిక్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్ వంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. వైద్య కళాశాలల్లోని పాఠ్యాంశాలకు అదనంగా సీనియర్ వైద్యుల అనుభవాలను తెలుసుకోవడం, నూతన వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవడం యువ వైద్యులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు 50 వేల నుంచి 1.50 లక్షలకు, పీజీ సీట్లు 67 వేలకు పెరిగాయని గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి దక్షిణ భారతదేశంలో ఉన్నన్ని ఆర్థోపెడిక్ పీజీ సీట్లు ప్రస్తుతం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సీట్ల సంఖ్య పెరగడంతో పోటీ పెరిగినప్పటికీ, అంకితభావం, నైపుణ్యం కలిగిన వైద్యులకు మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు.గత 28 ఏళ్లుగా వైద్య విద్యాసంస్థలను నిర్వహిస్తున్న అనుభవంతో ప్రతి వైద్య కళాశాలలో ఇలాంటి సదస్సులను నిర్వహించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మమత ఆధ్వర్యంలో ఆప్తమాలజీ, న్యూరోసైన్సెస్, సైకియాట్రీ విభాగాల్లో సదస్సులను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి ఆర్థోపెడిక్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రస్థాయి వైద్య సదస్సుల నిర్వహణకు కూడా తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టోసా అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, కార్యదర్శి విజయచందర్ రెడ్డి, టోసా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పీఎన్వీఎస్వీ ప్రసాద్, కో-చైర్మన్ డాక్టర్ హనుమాన్, కార్యదర్శి డాక్టర్ తేజ్ కుమార్, వైద్యులు అరిఫ్, రాజ్ కుమార్, ప్రసాద్, శ్రీనివాసరావు, తోట లక్ష్మణ్, మమత మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనురాధ, సూపరింటెండెంట్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

