రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలతో ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు మర్రి మహేశ్ ఖాతా నుంచి రూ.57,400 మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహేశ్ శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లే సమయంలో తన సెల్‌ఫోన్‌ను ద్విచక్ర వాహనం బ్యాగులో ఉంచాడు. తిరిగి వచ్చి చూడగా ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవడంతో మరమ్మతుల కోసం తీసుకెళ్లాడు. అయినప్పటికీ ఫోన్ పనిచేయకపోవడంతో అందులోని సిమ్ కార్డులను తొలగించాడు. శనివారం ఉదయం భార్య ఫోన్లో సిమ్ కార్డులు అమర్చి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా బ్యాంకు బ్యాలెన్స్ పరిశీలించగా రూ.57,400 కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో జరిగిన ఈ ఘటనతో బాధిత రైతు ఆందోళనకు గురయ్యాడు. ప్రజలు అపరిచిత లింకులు, అనుమానాస్పద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రమేశ్ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
చందుర్తి రైతుకు సైబర్ మోసం.. రూ.57,400 మాయం

