ప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?
ఆత్మకూర్లో స్థానిక ఉద్యోగుల పెత్తనమా..? తెరవెనుక నడిపిస్తున్నదెవరు?
ఆత్మకూర్లో అధికారుల నియామకాలపై అనుమానాలు!
సొంత పట్టణంలోనే ఉద్యోగ బాధ్యతలా..? నిబంధనలు ఏమంటున్నాయి.. తెరవెనుక ఉన్నదెవరు?
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో అదే పట్టణానికి చెందిన వారే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండటంపై ఇప్పుడు చర్చ మొదలవుతోంది. సొంత పట్టణంలోనే ఉద్యోగం చేస్తూ కీలక బాధ్యతలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? అసలు ఈ నియామకాల వెనుక ఉన్న కారణాలేమిటి? వీరి నియామకాలకు ఎవరి అండదండలు ఉన్నాయి? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడ పనిచేసినా నిబంధనలకు అనుగుణంగా, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే సొంత పట్టణంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు వ్యక్తిగత పరిచయాలు, స్థానిక ఒత్తిళ్లు, రాజకీయ పలుకుబడి, బంధుత్వ సంబంధాలు విధుల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలకు నేరుగా సేవలందించే శాఖల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే పారదర్శకతకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఒకే ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల విధుల నిర్వహణలో అలసత్వం పెరుగుతుందా? స్థానిక పరిచయాల కారణంగా కొందరికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోందా? సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో వివక్షకు తావు ఏర్పడుతోందా? అనే అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ శాఖల్లో నియామకాలు, బదిలీలు కేవలం పరిపాలనా అవసరాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలి. ఎవరి సిఫార్సులకో, పలుకుబడికో ప్రాధాన్యత ఇస్తున్నారనే అనుమానాలకు తావులేకుండా వ్యవస్థ పనిచేయాలి. సొంత పట్టణంలో ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పలేం. కానీ నిబంధనలు, పారదర్శకత, ప్రయోజనాల సంఘర్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే ప్రాంతంలో కీలక బాధ్యతలు కొనసాగించడం మాత్రం సమీక్షించాల్సిన విషయమే.ఆత్మకూర్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో స్థానికులకు సంబంధించిన నియామకాలు, వారి సేవాకాలం, బదిలీ నిబంధనల అమలుపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిజంగా నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయా? స్థానికంగా పనిచేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయా? ఒకే ప్రాంతంలో కొనసాగడానికి కారణాలేమిటి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

