హోటళ్లు, స్వీట్ షాపులు, తినుబండారాల దుకాణాల్లో నాణ్యతపై నీలినీడలు..
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?
అపరిశుభ్ర పరిసరాలు.. ఆహార భద్రతా ప్రమాణాలు గాలికి..
అధికారుల పర్యవేక్షణ ఏదీ?
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:
ఆత్మకూరు పట్టణంలో ఆహార కల్తీ, నాణ్యతలేని తినుబండారాలు, అపరిశుభ్ర వాతావరణంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణ కేంద్రంలోని పలు హోటళ్లు, స్వీట్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తినుబండారాల దుకాణాల్లో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని హోటళ్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారా లేదా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
**రుచికరమైన ఆహారం పేరుతో అనారోగ్యాన్ని అంటగడుతున్నారా?**
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన హోటళ్లు, స్వీట్ షాపుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, కొన్ని చోట్ల పరిసరాల నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే నూనెల నాణ్యత, పదార్థాల నిల్వ, వాటి కాలపరిమితి, వంటగదుల పరిశుభ్రత వంటి అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు హోటళ్లలో లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుండటంతో వారి ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
**తనిఖీలు ఎక్కడ? అధికారుల పర్యవేక్షణ ఏది?**
ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉంది. హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలు, చిరుతిళ్ల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆహార నమూనాలను సేకరించి నాణ్యతను పరీక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
**ప్రజల ఆరోగ్యం వ్యాపార ప్రయోజనాలకు బలికావద్దు!**
ఆహార వ్యాపారం నిర్వహించడం లాభాల కోసమే అయినప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే పరిస్థితులు ఉండకూడదు. హోటల్ యజమానులు పరిశుభ్రత, నాణ్యత, ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆత్మకూరు పట్టణంలోని హోటళ్లు, స్వీట్ షాపులు, తినుబండారాల దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

