ఆత్మకూరులో ప్రైవేటు విద్యాసంస్థల తీరు పై అనేక ప్రశ్నలు
చదువు పేరుతో దోపిడీనా..ర్యాంకుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడా?
“విద్యాశాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారా..? పర్యవేక్షణ ఎక్కడ?
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
విద్య అనేది వ్యాపారం కాదు.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యత. కానీ నేటి పోటీ ప్రపంచంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల నిర్వహణ తీరు చూస్తుంటే విద్య సేవా రంగమా? లేక లాభాల వేటలో సాగుతున్న వ్యాపారమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలపై ఫీజుల భారం, అదనపు ఖర్చులు, విద్యార్థులపై ఒత్తిడి, విద్యా ప్రమాణాల అంశాల్లో తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
*_ఫీజుల పేరుతో నిలువు దోపిడీనా..?_*
పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే తల్లిదండ్రుల ఆశను కొన్ని విద్యాసంస్థలు ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నాయా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్ ఫీజులు, నెలవారీ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర అవసరాల పేరుతో కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. సామాన్య కుటుంబాలకు ప్రైవేటు విద్య భారంగా మారుతుంటే దీనిపై ప్రశ్నించేవారు ఎవరు? ఫీజుల వసూళ్లలో పారదర్శకతను పరిశీలించేవారు ఎవరు?
*_ర్యాంకుల పిచ్చిలో బాల్యం బలి!_*
చిన్నారుల మానసిక వికాసం, ఆటపాటలు, సృజనాత్మకత కంటే మార్కులు, ర్యాంకులకే ప్రాధాన్యత పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువులు, హోంవర్క్‌లు, పరీక్షలు, ప్రత్యేక తరగతులతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. విద్యార్థి ప్రతిభను వెలికితీయాల్సిన విద్యాసంస్థలు ర్యాంకుల ప్రచారానికే పరిమితమైతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది.పుస్తకాల బరువా..? విద్యార్థులపై భారమా..చిన్న వయసులోనే భారీ పుస్తకాల బ్యాగులను భుజాన మోస్తూ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా పుస్తకాల బరువును నియంత్రించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై లేదా? పిల్లల ఆరోగ్యం కంటే పుస్తకాల సంఖ్యే ముఖ్యమా? అన్న ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.
*_విద్యా ప్రమాణాలు ఎక్కడ..? తనిఖీలు ఏవి..?_*
పాఠశాలల్లో బోధనా నాణ్యత, ఉపాధ్యాయుల అర్హతలు, తరగతి గదుల వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా? ఫీజుల వసూళ్లలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ప్రైవేటు విద్యాసంస్థలపై పర్యవేక్షణ బాధ్యత కలిగిన విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను తెలుసుకోవాలి. ఏదైనా ఫిర్యాదు వచ్చిన తర్వాతే స్పందిస్తారా? లేక ముందుగానే అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకుంటారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
*_ఇప్పటికైనా మేల్కొనాలి విద్యాశాఖ!_*
ఆత్మకూరు పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థలపై సంబంధిత అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలని, ఫీజుల వసూళ్లు, అదనపు ఖర్చులు, బోధనా ప్రమాణాలు, విద్యార్థులపై ఒత్తిడి, పాఠశాలల మౌలిక వసతులపై సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

