_ ఈ నెల 19 వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
_ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా
_ గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు*
_ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
_ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్య మంత్రి
హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 13 :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి
అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం* సన్నద్ధతపై శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రణాళిక శాఖ, ఆర్థిక సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశంలోనే వినూత్నమైనదని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని తెలిపారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 14వ తేదీన జవహర్లాల్ నెహ్రూ జయంతి నుంచి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వహించిన తాజా కులగణన సర్వే ద్వారా కుటుంబాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.
*ప్రత్యేక నమోదు కేంద్రాలు*
ఈ నెల 19వ తేదీన ప్రతి గ్రామం, మున్సిపల్ పరిధిలో వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి కుటుంబాల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణంలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. కుటుంబానికి సంబంధించిన జీవిత బీమా కవరేజీ కుటుంబ సభ్యుల వివరాలను కచ్చితంగా సేకరించాలని సూచించారు. దరఖాస్తులో జిల్లా, మండలం, గ్రామం లేదా వార్డు వివరాలతో పాటు బీమా పొందే వ్యక్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగం, ఆధార్ ప్రకారం పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు కూడా సేకరించాలని సూచించారు.
కుటుంబానికి సంబంధించిన జీవిత బీమా కవరేజీ కోసం 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల కుటుంబ సంపాదన సభ్యుల వివరాలను కచ్చితంగా సేకరించాలని సూచించారు.
నామినీ పేరు, సంబంధం, ఆధార్ వివరాలతో పాటు ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలుగా ఉంటే వారికి కేటాయించే వాటా వివరాలను నమోదు చేయాలని తెలిపారు.
దరఖాస్తుల డిజిటలైజేషన్లో పొరపాట్లకు తావు ఇవ్వద్దని,
సేకరించిన దరఖాస్తులను డిజిటలైజేషన్ చేసి, సంతకం చేసిన స్కాన్ ప్రతులను బీమా సంస్థకు పంపించాలని సీఎస్ సూచించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి బీమా రక్షణ కల్పించేలా వివరాల సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, దరఖాస్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
*ఏర్పాటు పగడ్బందీగా చేయాలి*
ఈ నెల 19వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కోసం దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సూపర్ వైజర్లు, జిల్లా స్థాయి అధికారులను నియమించాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ ప్రక్రియ తదితర అంశాల కోసం కావాల్సిన సిబ్బంది, పరికరాలు అందుబాటులో పెట్టాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తుల స్వీకరణ పై తమ పరిధిలో సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీర భద్రయ్య, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

