మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
పట్టణంలోని డఫోడీల్స్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి అలవాట్లను, గురువులు చెప్పే పాఠాలను, మంచి నడవడికను, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని తెలిపారు. చదువులో సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్య పట్ల నిర్లక్ష్యం వహించరాదని, మీ భవిష్యత్ కి ఈ విద్య పునాది అవుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులలో క్రమశిక్షణ ఉండాలని ఇది వారి అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు.మీ మంచి అలవాట్లు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తాయని తెలిపారు. విద్యార్థులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా నటించిన విద్యార్థులు మాట్లాడుతూ మేము తరగతి గదిలో ఉంటే మా ఉపాధ్యాయులు పడుతున్న కష్టం మాకు అర్థమయ్యేది కాదని, ఈరోజు మాకు అర్థమైందని అన్నారు. వారు ఎంతో కష్టపడి విద్యార్థి జీవితం బాగుండాలని పాఠాలు చెప్తున్నారు అన్నారు. వారు చెబుతున్న పాటలు మన భవిష్యత్ కి తోడ్పడుతుంది కనుక విద్యార్థులందరూ ఇది గ్రహించి మంచిగా చదువుకోవాలని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం దాకా వారు పడుతున్న కష్టం మామూలు విషయం కాదని ఉపాధ్యాయులకు ఎంతో ఓర్పు నేర్పు ఉండాలని అన్నారు. ఉపాధ్యాయులు అందర్నీ ఎల్లపుడు గౌరవించుకోవాలని కోరారు. విద్యార్థుల కేరింతల మధ్య వీరి ఉపన్యాసం చక్కగా కొనసాగింది. విద్యార్థులు తమ ఆనందాన్ని, సంతోషాన్ని వెలిబుచ్చారు. చివరగా పాఠశాల చైర్మన్ నరేందర్ ఉపాధ్యాయులుగా నటించిన విద్యార్థులందరికీ ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



