-:16వ తేదీన బాలల ప్రజావాణి
-:జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
మన ప్రగతి న్యూస్ /
రాజన్న సిరిసిల్ల జిల్లా :
బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
పిల్లల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TGSCPCR) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సాధారణ ప్రజావాణితోపాటు ప్రత్యేకంగా ‘బాలల ప్రజావాణి’ నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ బాలల ప్రజావాణిలో బాలలకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కుల పరిరక్షణ, బాలల భద్రత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అనాథ, సంరక్షణ అవసరమైన బాలల సమస్యలు, బాలల అభివృద్ధి తదితర అంశాలపై ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
అలాగే బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు కూడా తమ పరిధిలోని బాలల సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించడంతోపాటు, వారి హక్కులను కాపాడి, సమస్యలకు పరిష్కారం చూపడమే బాలల ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

