ఆత్మకూరు ఎస్సై వి. జయన్న….
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎస్సై జయన్న విద్యార్థులకు సైబర్ నేరాల వల్ల కలిగే ప్రమాదాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, అదే సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించే సమయంలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవకూడదని, అనుమానాస్పద సందేశాలకు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, రహస్య సంకేతాలను ఎవరికీ వెల్లడించకూడదని వివరించారు.ఆన్‌లైన్ మోసాలు, నకిలీ బహుమతి సందేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు, వ్యక్తిగత చిత్రాల దుర్వినియోగం వంటి సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సైబర్ మోసానికి గురైనప్పుడు జాతీయ సైబర్ నేరాల సహాయ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.విద్యార్థులు చదువుతోపాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకు మాత్రమే వినియోగించాలని ఎస్సై జయన్న సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రతి విద్యార్థి అప్రమత్తంగా ఉండటమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.

