ట్రాన్స్జెండర్లకు పోలీసుల సూచనలు.. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్
వేములవాడ, నవంబర్ 14: దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యవహరించాలని ట్రాన్స్జెండర్లకు వేములవాడ పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శనివారం వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులను శాపనార్థాలతో భయపెట్టడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, శుభకార్యాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు అందితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురిచేసినా, అవమానించినా లేదా ఉపాధి, సంక్షేమపరమైన సమస్యలు ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చన్నారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం-2019 ప్రకారం హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

