ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
వేములవాడ నియోజకవర్గ స్థాయి చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ముందుగా జయ జయహే తెలంగాణ గీతంతో ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రోజూ సుమారు 18 గంటలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేది నుంచి కొత్తగా మంజూరైన పెన్షన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలో కొత్తగా 8,209 పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఇప్పటికే జిల్లాలో 1,13,264 మందికి పెన్షన్లు అందుతున్నాయని, కొత్తగా మంజూరైన పెన్షన్లతో కలిపి మొత్తం 1,21,473 మందికి ప్రతి నెలా పెన్షన్లు అందనున్నాయని వివరించారు. ఇందుకోసం ప్రతి నెలా సుమారు రూ.25.97 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించనుందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలను కొనసాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలుస్తూ, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
_ జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు (తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా) గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు నుంచి ఇప్పటికే దరఖాస్తుదారులు స్వీకరించామని తెలిపారు. అర్హుల ఎంపిక కోసం అధికారులతో విచారణ చేయించామని పేర్కొన్నారు.
ఆగస్టు 01 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించామని, ఆయా దరఖాస్తులను అధికారులు విచారణ చేయించామని తెలిపారు. ఈ నెల 18 వ తేదీ వరకు మంజూరు పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. 19వ తేదీన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారి పేరిట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పించే పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించే బాధ్యత అప్పగించామని తెలిపారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వ చట్టం చేసిందని, త్వరలో అమలు కానున్నదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, ఫ్యాక్స్ ఛైర్మెన్లు వకులాభరణం శ్రీనివాస్, బొమ్మేన భాస్కర్, ఏగోలపు శ్రీనివాస్, గసికంటి ప్రభాకర్, పిల్లి కనకయ్య,
ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

