వేములవాడ పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల పరిసరాల్లో పారిశుధ్యం పూర్తిగా కొరవడింది. పాఠశాల పక్కనే మురికి నీరు నిల్వ ఉండటంతో పాటు చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీనికి తోడు పందుల సంచారం, దోమలు, ఈగల బెడదతో విద్యార్థులు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిల్వ ఉన్న మురికి నీటితో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మురికి నీటిని తొలగించి, చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడంతో పాటు పందుల సంచారాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!

