ఆహ్వానించకుండా ప్రత్యేక పూజలు నిర్వహించడంపై బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి ఆభరణాల తరలింపు కార్యక్రమంలో రాజకీయ వివాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి కురుమూర్తి దేవస్థానానికి స్వామివారి ఆభరణాలను తీసుకెళ్లే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి తగిన గౌరవం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్కడికి హాజరైనప్పటికీ, ఆయనను కార్యక్రమానికి ఆహ్వానించకుండా పూజా కార్యక్రమాలు కొనసాగించడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆలయ ఛైర్మన్ బత్తుల బాలరాజును నిలదీస్తూ వాగ్వాదానికి దిగారు.స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే పవిత్ర కార్యక్రమాలని, ఇలాంటి వేడుకల్లో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంటుందని బీఆర్ఎస్ కార్యకర్తలు పేర్కొన్నట్లు సమాచారం. పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ పరిణామం అక్కడ కొంతసేపు చర్చనీయాంశంగా మారింది.స్వామివారి ఉత్సవాలు రాజకీయ వివాదాలకు వేదిక కాకుండా, భక్తుల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

