ఆది సాయికుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ లవ్ సాంగ్ విడుదల
ఎంటర్టైన్మెంట్ డెస్క్: ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘ఈగో రాజా’ చిత్రం నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో ఆది సాయికుమార్ స్టెప్పులు, హీరోహీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా లుంగీలో ఆది వేసిన హుక్ స్టెప్పులు పాటలో ప్రత్యేకంగా నిలిచాయి.
ఎస్జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఆది సాయికుమార్ కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఆది సాయికుమార్‌తో పాటు సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
‘రౌడీ రాకాసి’ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. శిభి శ్రీనివాసన్ ఈ పాటను ఆలపించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.
‘శంబాల’ తర్వాత ఆది సాయికుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

