_ జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
_ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
మన ప్రగతి న్యూస్/సిరిసిల్ల జిల్లా
చేయూత సామాజిక భద్రత కింద జిల్లాలో కొత్తగా పెన్షన్ల అర్హత మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.చేయూత పెన్షన్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం డీఆర్డీఓ, చేనేత జౌళి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు (తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా) గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. అర్హుల ఎంపిక కోసం మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారుల ఆద్వర్యంలో విచారణ చేయించామని
వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అర్హులైన వారికి నూతన పెన్షన్ మంజూరు అర్హత పత్రాలను అందజేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేయూత పెన్షన్ ప్రయోజనం అందేలా పరిశీలన ప్రక్రియను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఏడీ హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ సంతోష్, డీఎంహెచ్ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్, తదితరులు పాల్గొన్నారు.

