రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో బాలల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలబాలికలతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేలా చర్చించారు.ఈ సందర్భంగా బాలబాలికలు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర రంగాల్లోనూ ఆసక్తి పెంపొందించుకొని తమ ప్రతిభను చాటుకోవాలని అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతపంటి మల్లేశం, ఉపసర్పంచ్ అచ్చ వినోద్, ఉపాధ్యాయులు సరిత, అంజలి, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, మహిళా సభ్యులు, బాలబాలికలు పాల్గొన్నారు.
నాగయ్యపల్లిలో బాలల సభ.. విద్యార్థుల సమస్యలపై చర్చ

