సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘DNK’ ట్రైలర్ విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించింది.
ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన యువకుడు అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఈ కథలో ప్రధాన అంశం. లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడంతో పాటు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడు. అప్పులు తిరిగి చెల్లించాలంటూ గర్ల్‌ఫ్రెండ్ తండ్రి అతడి ఇంటికి వచ్చి హెచ్చరించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అప్పులు తీర్చేందుకు మార్గం కనిపించకపోవడంతో హీరో తన స్నేహితుడితో కలిసి ధనవంతుల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు వరుస దొంగతనాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. వీటి వెనుక బీహార్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తారు.
‘లిటిల్ హార్ట్స్’తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ఈ చిత్రంలో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆయనకు జోడీగా సుష్మిత శెట్టి నటించారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో అలీ, రాజిత కనిపించనున్నారు. బబ్లూ, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్, నంద గోపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌ల అప్పులు, ఆర్థిక ఇబ్బందులు వంటి ప్రస్తుత యువతకు సంబంధించిన అంశాలను కథలో భాగంగా తీసుకున్నారు దర్శకుడు శ్రీను కంబాల. కామెడీ, రొమాన్స్, దొంగతనాల నేపథ్యంలో కథను రూపొందించారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు తప్పుడు మార్గాలను ఎంచుకోవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే అంశాన్ని కూడా సినిమాలో చూపించినట్లు ట్రైలర్ వెల్లడిస్తోంది.
సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందించగా, సింజిత్ యెర్రమిల్లి సంగీతం సమకూర్చారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 13న ‘DNK’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

