మన ప్రగతి న్యూస్ / వనపర్తి/ఆత్మకూర్:-
ప్రజల పన్నులతో నడిచే మున్సిపాలిటీ.. ప్రభుత్వ నిబంధనలతో పనిచేయాల్సిన పాలనా వ్యవస్థ.. కానీ ఆత్మకూర్ మున్సిపాలిటీలో కీలక బాధ్యతల కేటాయింపు చూస్తుంటే నిబంధనలు నిజంగానే అమలవుతున్నాయా? లేక అధికారుల ఇష్టమే చట్టంగా మారిందా? అన్న ప్రశ్నలు పట్టణంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీనియారిటీ, అనుభవం, అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన చోట జూనియర్ ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు మున్సిపల్ పాలనపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి
మున్సిపాలిటీలో 2023లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన గాడి అశోక్‌కు 2026 నాటికి ఇన్చార్జ్ మేనేజర్ బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల అనుభవం కూడా పూర్తికాని ఉద్యోగికి మున్సిపాలిటీలో అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించే స్థాయిలో ఏ నిబంధన ఉంది? ఆ ఉత్తర్వులకు ప్రాతిపదిక ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
మున్సిపాలిటీలో పదేళ్లు, పదిహేనేళ్లుగా విధులు నిర్వహిస్తూ పాలనా వ్యవస్థపై అనుభవం సంపాదించిన సీనియర్ ఉద్యోగులు ఉండగా, వారిని పక్కనపెట్టి జూనియర్‌కు బాధ్యతలు అప్పగించడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి? సీనియర్ల సేవలు, అనుభవం, అర్హతలను పరిగణనలోకి తీసుకున్నారా? లేక తెరవెనుక ఏదైనా సిఫార్సు పనిచేసిందా?
సీనియారిటీకి విలువ లేదా?
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సేవా కాలం, అర్హతలు, విధి అనుభవం, పరిపాలనా సామర్థ్యం కీలక ప్రమాణాలుగా ఉండాలి. కానీ ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఈ ప్రమాణాలు అమలయ్యాయా? అన్నదానిపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సీనియర్ ఉద్యోగులు ఉండగా జూనియర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక కారణాలను అధికారులు వెల్లడించాలి. బాధ్యతల కేటాయింపు పారదర్శకంగా జరిగిందా? ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారా? అర్హులైన ఉద్యోగుల జాబితాను పరిశీలించారా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
కీలక కుర్చీ.. కీలక ఫైళ్లు!
మున్సిపల్ మేనేజర్ బాధ్యతలు అంటే కేవలం ఒక హోదా కాదు. పరిపాలనా వ్యవహారాలు, ఫైళ్ల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, వివిధ శాఖల సమన్వయం, పట్టణ అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాల ప్రక్రియలో ఈ బాధ్యతకు ప్రాధాన్యత ఉంటుంది.
అలాంటి కీలక బాధ్యతలు అప్పగించేటప్పుడు అనుభవం, అర్హత, పరిపాలనా అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదా? తగిన అనుభవం ఉన్న సిబ్బందిని పక్కనపెట్టి బాధ్యతలు కేటాయిస్తే పాలనా వ్యవస్థపై ప్రభావం పడదా? ప్రజాధనంతో నడిచే కార్యాలయంలో ప్రతి నిర్ణయానికి జవాబుదారీతనం ఉండాల్సిందే కదా?
అధికారుల మౌనం.. అనుమానాలకు ఆజ్యం!
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలు అప్పగించిన ఉత్తర్వులు, వాటికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగుల సీనియారిటీ వివరాలు, అర్హతల ప్రాతిపదికను బహిరంగంగా వెల్లడిస్తే వివాదానికి తెరపడుతుంది.
జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి, బాధ్యతల కేటాయింపు నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా అన్నది సమగ్రంగా పరిశీలించాలి. అవసరమైతే రికార్డులను తనిఖీ చేసి, సంబంధిత ఉద్యోగులు, అధికారుల నుంచి వివరణ తీసుకోవాలి.
బాధ్యతలు నిబంధనల ప్రకారమేనా? తేల్చాల్సిందే!
ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఇన్చార్జ్ మేనేజర్ బాధ్యతల కేటాయింపుపై నెలకొన్న వివాదానికి అధికారిక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిజమైతే బాధ్యతల కేటాయింపును సమీక్షించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. తప్పు జరగలేదని అధికారులు భావిస్తే సంబంధిత ఉత్తర్వులు, నిబంధనలు, అర్హతల వివరాలను వెల్లడించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి.
ప్రజల సొమ్ముతో నడిచే మున్సిపాలిటీలో పదవులు, బాధ్యతలు ఎవరి ఇష్టానుసారం నిర్ణయించబడకూడదు. పాలనలో పారదర్శకత ఉండాలి.. అధికారుల నిర్ణయాలకు జవాబుదారీతనం ఉండాలి.. నిబంధనలకు విలువ ఉండాలి.
ప్రజల ప్రశ్న ఒక్కటే.. మూడేళ్ల ఉద్యోగికి మేనేజర్ బాధ్యతలు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? సీనియర్లను పక్కనపెట్టడానికి కారణమేమిటి? ఆ ఉత్తర్వుల వెనుక ఉన్న నిబంధనలు ఏమిటి? ఆత్మకూర్ మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాల్సిందే!

