మన ప్రగతి న్యూస్/వనపర్తి/ ఆత్మకూర్:-
పవిత్ర కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ పరిసరాల్లో కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయలేని దుస్థితి ఆత్మకూరు మున్సిపల్ పాలకవర్గం, అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ స్వయంభూ చెర్ల పరమేశ్వర స్వామి దేవాలయానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగిస్తుండగా, ఆలయ పరిసరాల్లో చీకటి అలుముకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, అధికార పార్టీ నాయకుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం భక్తుల్లో అసహనానికి కారణమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు తమ బాధ్యతను విస్మరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.చివరకు ‘వాస్తవాలు డిజిటల్ మీడియా’ జర్నలిస్ట్ అజయ్ కుమార్ స్వయంగా చొరవ తీసుకున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు చీకటితో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించి వెలుగులు నింపారు. ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పనిని ఒక జర్నలిస్ట్ తన వ్యక్తిగత నిధులతో చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆయన చొరవను భక్తులు, పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
ప్రజల సౌకర్యాల కోసం పనిచేయాల్సిన మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పండుగ రోజున కూడా కనీస విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ఆలయ పరిసరాల్లో వెలుగులు, భద్రతా ఏర్పాట్లు కల్పించడం అధికారుల కనీస బాధ్యత కాదా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి, కలెక్టర్ తక్షణమే స్పందించాలి:
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆలయ పరిసరాల్లో శాశ్వతంగా వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.

