తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. కలెక్టర్‌కు కిసాన్ మోర్చా నాయకుల వినతి
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
మరుసు తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని నాణ్యత పేరుతో తిరస్కరించకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు భరోసా కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో సత్వరమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో రైస్ మిల్లర్లు చేస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పెట్టుబడులు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని నాయకులు పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నరుకుళ్ల వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు ఆపతి వెంకటరామారావు, మండేపూడి వీరనాగేశ్వరరావు, చితనిప్పు రామారావు, బిచ్చు నాయక్, జ్వాలా నరసింహారావు, వెంకటనారాయణ యాదవ్, బొల్ల రాంబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


