వ్యవసాయ పొలాల వద్ద వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు, వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.
వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణులను చంపడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు.ఇలాంటి ప్రమాదకరమైన చర్యల వల్ల అటవీ జంతువులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు, పశువులు సైతం ప్రాణాపాయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రజలు ఎవరూ ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడవద్దని, వన్యప్రాణుల వేటగాళ్లు సైతం ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు లేదా వన్యప్రాణుల ప్రాణాలకు హాని కలిగించినట్లు గుర్తిస్తే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

