క్రైమ్ డెస్క్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారి దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు రావడం హైదరాబాద్ పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. నగరంలోని షేక్‌పేట ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఓ వ్యక్తిని బెదిరించి అతని వద్ద నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్, హోంగార్డుపై కేసు నమోదు కావడంతో పోలీసు వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 4న ఓ వ్యక్తి అత్యవసర అవసరం కోసం తన స్నేహితుడిని డబ్బులు అడిగాడు. దీంతో స్నేహితుడు షేక్‌పేట నాలా వద్దకు వచ్చి నగదు అందజేసి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి డబ్బులను లెక్కపెట్టి బ్యాగులో పెట్టుకుంటుండగా అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించారు. అతడిని ఆపి బ్యాగులో ఏముందని ప్రశ్నించారు. అందులో స్వీట్ బాక్స్ ఉందని చెప్పినప్పటికీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ తమ వాహనంలోకి ఎక్కాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బ్యాగును తనిఖీ చేయగా అందులో నగదు కనిపించడంతో పోలీసులు రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని బాధితుడు చెప్పినా వారు వినలేదని, చివరకు అతని వద్ద నుంచి రూ.50 వేలు తీసుకుని వెళ్లిపోయారని సమాచారం. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు రెండు రోజుల తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఓ కానిస్టేబుల్, హోంగార్డుపై కేసు నమోదు చేశారు.
అయితే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానిస్టేబుల్, హోంగార్డుతో కలిసి నగదు వసూలు వ్యవహారంలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోంగార్డు విచారణలో కూడా సబ్‌ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకే బాధితుడిని బెదిరించినట్లు వెల్లడించినట్లు సమాచారం. అయినప్పటికీ సంబంధిత అధికారిపై చర్యలు లేకపోవడంపై పోలీసు వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కేసు నమోదైన విషయం తెలిసిన తర్వాత సంబంధిత కానిస్టేబుల్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు గురించి ముందుగానే తెలుసుకున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ సూచనల మేరకే అతడు తప్పించుకున్నాడన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ఘటన జరిగిన రోజు పెట్రోలింగ్ డ్యూటీ రిజిస్టర్‌లో సదరు ఎస్‌ఐ పేరు లేకుండా మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల జోక్యం, బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో జరుగుతున్న పరిణామాలు ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి.
ప్రజల భద్రత, పోలీసు వ్యవస్థపై నమ్మకం నిలబెట్టడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత. విధి నిర్వహణ పేరుతో సామాన్యులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు లేని అధికారుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరగాలని స్థానికంగా చర్చ జరుగుతోంది. షేక్‌పేట ఘటనలో అసలు బాధ్యులెవరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

