ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
పేదల భూములకు అన్యాయం జరగనివ్వను..
–రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్ /వేములవాడ ప్రతినిధి :

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో 10 లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మహిళా సమాఖ్య సంఘాన్ని, మారుపాక గ్రామంలో వ్యవసాయ గోదాం ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు..రాష్ట్ర ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు, నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు..దేశంలో రైతు సంక్షేమానికి జవహర్లాల్ నెహ్రూ హయాంలో ప్రారంభమైన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఎల్లంపల్లి, జూరాల, ఎల్ఎండీ, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులు వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.గతంలో రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర లభించక ఇబ్బందులు పడుతున్న సమయంలో 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,400కు పైగా కనీస మద్దతు ధర లభిస్తున్న నేపథ్యంలో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తే రైతులు అక్కడ విక్రయించుకోవచ్చని, లేకపోతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు…*పేదల భూములకు అన్యాయం జరగనివ్వను*పేదల సంక్షేమం, నిరుపేదలకు న్యాయం చేయడమే తన ప్రథమ కర్తవ్యమని,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. మర్రిపల్లి గ్రామానికి సంబంధించిన భూములపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని అన్నారు.అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.గతంలో 2015, 2016 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి ఇప్పటికే వివిధ ప్రభుత్వ అవసరాలకు కేటాయింపులు జరిగాయని వివరించారు.40 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలోనే వివిధ అవసరాలకు వెళ్లాయని తెలిపారు.పేదల పక్షాన నిలబడటమే తన లక్ష్యమని, భూముల వ్యవహారంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి అంశాన్ని పారదర్శకంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.మర్రిపల్లి చెరువును గత పదేళ్ల పాలనలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని విప్ అన్నారు. ప్రజా ప్రభుత్వం చెరువు పనులను పూర్తి చేసి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించి, ప్రజల మన్ననలు పొందుతుందనే ఉద్దేశంతోనే కొందరు కావాలనే పనులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.రైతులకు మేలు చేసే అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా చూడాలని, మర్రిపల్లి చెరువు పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అడ్డంకులు సృష్టించడం మానుకోవాలన్నారు..*రైతు సంక్షేమనికి పెద్ద పీట*రాష్ట్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ నిపుణుల సూచనల మేరకు అధిక దిగుబడులు, మార్కెట్లో మంచి ధర లభించే ఏడు రకాల సన్న వడ్ల సాగును ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. సన్న వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించే నిర్ణయం రైతులకు ప్రయోజనకరంగా మారిందని తెలిపారు. కనీస మద్దతు ధరతో పాటు బోనస్ అందించడం ద్వారా రైతులకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.రైతులకు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వేములవాడ నియోజకవర్గంలో 19 నూతన సబ్స్టేషన్లను మంజూరు చేసుకున్నామని తెలిపారు. 33/11 కేవీ, 132/33 కేవీ తదితర విద్యుత్ సదుపాయాలను మెరుగుపరుస్తూ వ్యవసాయ మోటార్లకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ప్రాజెక్టుల్లోకి గత ఏడాదితో పోలిస్తే తక్కువగా నీరు చేరిందని, గత ఏడాది సుమారు 400 టీఎంసీలకు పైగా నీరు చేరగా, ఈ ఏడాది 200 టీఎంసీలకు పైగా మాత్రమే చేరిందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన పరిస్థితులను కూడా రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. కరువు పరిస్థితులు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.గతంలో కరోనా సమయంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంత ఉందో, ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో కూడా ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.గోదావరి జలాలను ఎగువ ప్రాంతాలకు తరలించి సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ సమస్యలు, నీటి నిల్వపై ఉన్న పరిమితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకోవడంతో పాటు దుమ్ముగూడెం వద్ద ఇసుక సంచులతో నీటిని నిల్వ చేసి సాగునీటి అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. గత తొమ్మిదేళ్లలో సుమారు 86 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసిన పరిస్థితితో పోలిస్తే, తమ ప్రభుత్వం తక్కువ కాలంలోనే సుమారు 65 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఎగువ ప్రాంతాలకు అందించే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు.జిల్లాకు మంజూరైన రైతు విజ్ఞాన కేంద్రం వేములవాడ ప్రాంతానికి రావడం ఎంతో సంతోషకరమని ఆది శ్రీనివాస్ అన్నారు. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు భూసార పరీక్షలు, పంటల ఎంపిక, నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడులపై శాస్త్రీయ సూచనలు అందుతాయని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భూమి స్వభావం, నేలలోని పోషకాల ఆధారంగా ఏ పంటలు సాగు చేస్తే రైతులకు ఎక్కువ లాభం కలుగుతుందో నిపుణుల ద్వారా తెలియజేసే అవకాశం కలుగుతుందని వివరించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో కూడా రైతు సంక్షేమం, సాగునీటి వసతులు, విద్యుత్ సరఫరా, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
