మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
సమాజ గమనానికి ఉపాధ్యాయులే మార్గదర్శులని వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైరా మండల విద్యాశాఖ, మండల ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.మండల విద్యాశాఖాధికారి చావా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రకళ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే మహోన్నత బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులకు కేవలం విద్యాబోధన చేయడమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మండల పరిధిలోని ప్రతి కాంప్లెక్స్ నుంచి ఐదుగురు చొప్పున మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అలాగే మండలంలోని ఎనిమిది ఉన్నత పాఠశాలల నుంచి ఎంపికైన ఎనిమిది మంది ఉపాధ్యాయులను, గత ఏడాది కాలంలో పదవీ విరమణ చేసిన తొమ్మిది మంది ఉపాధ్యాయులను సత్కరించారు.ఈ కార్యక్రమంలో గరికపాడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రమేష్‌తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారి ప్రతిభను గౌరవిస్తూ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఉపాధ్యాయ సమాజంలో నూతనోత్సాహాన్ని నింపింది.


