
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు.శనివారం ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలతో నిరుద్యోగులను ఆకట్టుకుని ఇప్పుడు వారి ఆశలను నీరుగారుస్తోందన్నారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లను మినహాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని అజయ్‌కుమార్ ఆరోపించారు. గురుకులాల్లో మౌలిక వసతుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఐక్యంగా ఎదురించి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.
