నకిలీ నంబర్ ప్లేట్‌తో ప్రయాణం.. పోలీసులను చూసి పరారయ్యే యత్నం
మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
ఆత్మకూరు పట్టణంలో నకిలీ నంబర్ ప్లేట్‌తో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో పోలీసుల తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. మహమ్మద్ వజీర్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి TS 06 EK 1786 నంబర్ ప్లేట్ అమర్చుకుని ప్రయాణిస్తున్నాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను గమనించిన అతడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బైకును అడ్డగించి తనిఖీ చేశారు.ఈ క్రమంలో వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించగా, నంబర్ ప్లేట్‌పై ఉన్న TS 06 EK 1786 నంబర్‌కు బదులుగా, వాహన పత్రాల్లో TS 08 EK 1786 నంబర్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో నంబర్ ప్లేట్‌కు, వాహన పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు వెంటనే బైకును స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయాన్ని ఆత్మకూరు ఎస్సై జయన్న వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన అసలు గుర్తింపును దాచిపెట్టి నకిలీ నంబర్ ప్లేట్లతో రోడ్లపై తిరగడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే పోలీసుల చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన రిజిస్ట్రేషన్ నంబర్లతోనే వాహనాలు నడపాలని సూచించారు.

