మార్క్సిజమే మానవ సమస్యలకు పరిష్కారం
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
అక్టోబర్ విప్లవ 109వ వార్షికోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి విజయాన్ని సాధించిన రష్యన్ అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేసి, సమసమాజ స్థాపనకు కృషి చేయాలని ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు.
ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ విప్లవ 109వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట పట్టణంలో ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంగడి సెంటర్‌లోని అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, 1917లో రష్యాలో విజయవంతమైన అక్టోబర్ మహా విప్లవం ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల విముక్తికి గొప్ప స్ఫూర్తినిచ్చిందన్నారు. నాటి పెట్టుబడిదారీ, భూస్వామ్య దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా మార్క్సిజాన్ని సరైన రీతిలో అన్వయించి సోషలిస్టు విప్లవాన్ని సాధించారని, అది ప్రపంచవ్యాప్తంగా సమసమాజ స్థాపనకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు.సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానాల దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలకు నేటికీ అక్టోబర్ విప్లవమే దిక్సూచిగా నిలుస్తోందని గుర్తుచేశారు. నిరంకుశ పాలన, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ సమసమాజ స్థాపన కోసం ఎర్రజెండా శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ చూపిన బాటలో, అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. చీలిపోయిన కమ్యూనిస్టు శక్తులను, సామాజిక శక్తులను ఐక్యం చేసేందుకు ఎంసిపిఐ(యు) నిరంతరం కృషి చేస్తుందని పెద్దారపు రమేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, వంగల రాగసుధ, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, ఎల్లబోయిన రాజు, డివిజన్ నాయకులు జన్ను రమేష్, అనుమల రమేష్, నాగెల్లి భాస్కర్, పకిడే చందర్ రావు, గడ్డం స్వరూప, పుట్టపాక సునీత, గణిపాక బిందు, కళ్లేపెళ్లి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

