
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:
జర్నలిస్టులకు సొసైటీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ప్రాతిపదికన ఇండ్ల స్థలాలు అందించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్–హెచ్–2843) ఖమ్మం జిల్లా కమిటీ గురువారం చింతకాని మండలం లచ్చగూడెంలో డిప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించింది. శుక్రవారం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఫెడరేషన్ నాయకులు కోరారు.ఈ సందర్భంగా స్పందించిన భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సొసైటీల ద్వారా స్థలాల కేటాయింపులో న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని, అలాంటి ఇబ్బందులు లేకుండా వ్యక్తిగతంగా లేదా బీపీఎల్ కోటా వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు.వినతిపత్రంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టుల్లో అధిక శాతం మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తూ అద్దె ఇండ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లడంతో పాటు పలు ఉద్యమాలు కూడా నిర్వహించామని వివరించారు.గత ప్రభుత్వం వెలుగుమట్ల–వీవీ పాలెం రెవెన్యూ పరిధిలో 23 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసినప్పటికీ అది అమలు కాలేదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ, న్యాయపరమైన చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీపై స్పష్టమైన విధానంతో పాటు అమలు తేదీని కూడా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంను కోరారు.వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, టీబీజేఏ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మానుకొండ రవికిరణ్, జిల్లా కమిటీ సభ్యులు రాంపుడి నాగేశ్వరరావు, కొత్త యాకేష్, మంకెన నాగేశ్వరరావు, నూకల రామచంద్రమూర్తి, కొమెర నాగేశ్వరరావు, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్షుడు తురగ రాఘవేంద్రమూర్తి, కార్యదర్శి గరిడేపల్లి వెంకటేశ్వర్లు, స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు నలుబోల మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
