
మన ప్రగతి న్యూస్/వైరా ప్రతినిధి:
ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ కే. జగదీష్ అకాల మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ జగదీష్ మృతి తనకు వ్యక్తిగతంగా, మమతా వైద్య విద్యా సంస్థలకు, ఖమ్మం జిల్లా ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.2012లో మమతా వైద్య సంస్థల్లో చేరిన డాక్టర్ జగదీష్ తక్కువ కాలంలోనే సిబ్బంది, విద్యార్థులు, రోగులు, ప్రజలకు ఆప్తుడిగా మారారని అజయ్‌కుమార్ గుర్తుచేశారు. రోగుల పట్ల ఆయన చూపిన ఆప్యాయత, వైద్య వృత్తిపై ఉన్న అంకితభావం, సేవా దృక్పథం ప్రశంసనీయమన్నారు. మమతా ఆసుపత్రిలో న్యూరోసర్జరీ విభాగాన్ని బలోపేతం చేయడంలో, పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించడంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.ఖమ్మం ఐఎంఏ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా డాక్టర్ జగదీష్ వైద్య రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అజయ్‌కుమార్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయన చేసిన కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.డాక్టర్ జగదీష్ తనకు తమ్ముడిలాంటి వారని అజయ్‌కుమార్ భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఏ చిన్న గుర్తింపు లభించినా ఎంతో సంతోషంగా తనను కలిసి పంచుకునేవారని తెలిపారు. చివరి శ్వాస వరకు మమతా సంస్థల్లోనే ఉంటానని జగదీష్ చెప్పిన మాటలను స్మరించుకున్నారు.నిన్నటి వరకు తమతో ఎంతో ఆప్యాయంగా ఉన్న ఆయన నేడు తమ మధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఒంగోలు నుంచి వచ్చిన డాక్టర్ జగదీష్ భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.భగవంతుడు డాక్టర్ జగదీష్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.

