-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మన ప్రగతి న్యూస్ /కరీంనగర్ జిల్లా ప్రతినిధి:
ప్రత్యేక అధికారులు జిల్లాలోని ప్రతి పాఠశాలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు సహా పలు అంశాలపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమానంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు జిల్లాలోని ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు సందర్శించాలని ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధత,ప్రత్యేక తరగతులు,ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు, విటమిన్ గార్డెన్ నిర్వహణ,ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు,నిర్వహణ తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని అన్నారు.ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు వినియోగిస్తున్నది లేనిది పరిశీలించాలని,మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు. టాయిలెట్,తాగునీరు తదితర మౌలిక వసతులను పరిశీలించి ఏవైనా అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వర్షపు నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు ఎక్కడెక్కడ జరిగాయో వాటికి సంబంధించిన ఫోటోలను జిపిఎస్ ద్వారా నిర్దిష్ట వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున సిలబస్ పూర్తి చేయాలని,నిర్దిష్టమైన పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.విటమిన్ గార్డెన్ల నిర్వహణ,సాయంకాలం తరగతులను ప్రత్యేక అధికారులు పరిశీలించాలని అన్నారు.ప్రతి పాఠశాలలో ఐదు క్లబ్బులు ఏర్పాటు చేశామని,వాటి పనితీరును తెలుసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్,ఆర్డీవోలు మహేశ్వర్,రమేష్ బాబు పాల్గొన్నారు..

