_ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్..
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం నాడు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాల వివరాలు,స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి,స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైం వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పెండింగ్ కేసులు,కోర్టు కేసులు,ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు నేరాల స్థితిగతులపై సవివరంగా అడిగి తెలుసుకుని విలేజ్ పోలీస్ అధికారి విపిఓ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.గతంతో పోలిస్తే నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రతను కాపాడాలని,ఫైళ్లను క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉంచాలని,ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ లపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా చెక్ పెట్టేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ,విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని ఈసందర్భంగా ఎస్పీ సూచించారు.అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ,మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని యువతలో చట్టం పట్ల గౌరవం పెంపొందించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ప్రజలకు తలెత్తుతున్న సమస్యలకు తక్షణమే స్పందించి సత్వర సేవలందించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నుండి కేటాయించబడిన పెట్రోకార్,బొలెరో , ద్విచక్ర వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ మొగిలి,ఎస్.ఐ గణేష్ సిబ్బంది ఉన్నారు.


