Breaking News

అశ్వారావుపేట నడిబొడ్డున గ్యాస్ బాంబు

నిబంధనలు గాలికొదిలేసిన అక్రమ వ్యాపారం!

తక్షణ చర్యలకై ప్రజలు డిమాండ్

మన ప్రగతి న్యూస్/అశ్వారావుపేట ప్రతినిధి

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

శాంతియుతంగా ఉండే అశ్వారావుపేట పట్టణంలో పెను ప్రమాదం పొంచి ఉందని, నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల కళ్లు గప్పి కొందరు అక్రమార్కులు సాగిస్తున్న గ్యాస్ సిలిండర్ల దందా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని, జనావాసాల మధ్య వందల సంఖ్యలో గ్యాస్ బండలను నిల్వ చేస్తూ, ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాన్ని ఒక అగ్నిగుండంలా మారుస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని గుర్రాల చెరువు రోడ్డు ఇప్పుడు అక్రమ గ్యాస్ విక్రయాలకు అడ్డాగా మారిందని, ఎటువంటి కంపెనీ బోర్డులు లేకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇక్కడ విచ్చలవిడిగా గ్యాస్ బండల అమ్మకాలు సాగుతున్నాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని ప్రజలు వాపోతున్నారు. గతంలో పట్టణంలోని సాయి భారత్ గ్యాస్ ఏజెన్సీపై ఫిర్యాదులు రావడంతో, అధికారులు స్పందించి వారి గోడౌన్‌ను ఊరి బయటకు తరలింపజేశారు. మరి ఆ నిబంధనలు ఈ హెచ్పి గ్యాస్ కంపెనీకి వర్తించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎటువంటి బోర్డులు లేకుండా గ్యాస్ మండల నిల్వలపై సివిల్ సప్లై అధికారులు దాడి చేసి 29 గ్యాస్ సిలిండర్లను సీజ్ కూడా చేశారు. అయితే, అధికారులు మళ్లీ అటువైపు చూడకపోవడంతో అక్రమాలు యదేచ్చగా సాగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. “అధికారులు వస్తారు జరిమానా వేస్తారు వెళ్తారు అన్న ధీమాతో ఇప్పుడు ఏకంగా జనావాసాల మధ్యే వందల సంఖ్యలో సిలిండర్లను కుప్పలుగా పెట్టి విక్రయిస్తున్నారు. ఒక్క గ్యాస్ సిలిండర్ లీకైతేనే ఇల్లు గుల్లవుతుందని, అలాంటిది వందల సంఖ్యలో సిలిండర్లు ఒకే చోట, అదీ ప్రజలు నివసించే ప్రాంతంలో ఉండటం పెను ముప్పుకు సంకేతమని, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆ ప్రాంతమంతా శ్మశానంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీజ్ చేసినా మళ్లీ అదే దందా సాగిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమంగా సాగుతున్న ఈ గ్యాస్ దందాను అరికట్టాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని, సంబంధిత సివిల్ సప్లై అధికారులు మరియు పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి గుర్రాల చెరువు రోడ్డులో అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఏజెన్సీ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని, జనావాసాల మధ్య గ్యాస్ నిల్వలు లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, ప్రమాదం జరిగిన తర్వాత కన్నీరు కార్చడం కంటే, ప్రమాదం జరగకముందే అరికట్టడం మేలని అశ్వారావుపేట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అశ్వారావుపేటలో గ్యాస్ దందా నిర్వహిస్తుంటే మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా అనే అనుమానం కలుగుతుందని ప్రజలు అనుమానిస్తున్నారు. జనావాసాల్లో గ్యాస్ సిలిండర్ల నిల్వ అశ్వారావుపేట అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక వారితో కుమ్మక్కయ్యారా? అనేది అశ్వారావుపేట పట్టణంలో గ్యాస్ విక్రయాలు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. సామాన్య ప్రజలు చిన్న చిన్న నిర్మాణాలకు పర్మిషన్ తీసుకోవాలంటే రోజుల తరబడి తిప్పే మున్సిపల్ అధికారులు, వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు జనావాసాల మధ్య నిల్వ ఉంచుతున్నా ఎందుకు కళ్లు మూసుకున్నారని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. గుర్రాల చెరువు రోడ్డులో ‘అన్నపూర్ణ ఆయిల్, దాల్ అండ్ ఫ్లోర్ మిల్’ పేరుతో బోర్డు పెట్టి లోపల పిండి గిర్నీ పనులు జరగాల్సింది పోయి, ప్రమాదకరమైన గ్యాస్ సిలిండర్ల విక్రయాలు సాగుతున్నాయని, బోర్డు ఒకటి లోపల జరిగే వ్యాపారం మరొకటని, ఇలాంటి బోర్డుల వెనుక అక్రమ గ్యాస్ దందాను నిర్వహిస్తున్నా అధికారులకు కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తోందని, నిబంధనలు గాలికొదిలేసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు గ్యాస్ ఏజెన్సీ లేదా గోడౌన్ ఏర్పాటు చేయాలంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయని, గ్యాస్ గోడౌన్లు ఖచ్చితంగా జనావాసాలకు దూరంగా ఉండాలని, మున్సిపాలిటీ నుండి ట్రేడ్ లైసెన్స్, అగ్నిమాపక శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరని, గ్యాస్ నిల్వ చేసే చోట ఎలక్ట్రిక్ వైరింగ్ ఉండకూడదని, చుట్టూ రక్షణ గోడ ఉండాలని, సిలిండర్ల మధ్య ఖచ్చితమైన దూరం పాటించాలని, కానీ, ఇక్కడ ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదని, అసలు మున్సిపాలిటీ నుంచి ఈ గ్యాస్ విక్రయాలకు అనుమతి ఉందా? లేక అక్రమంగా నిర్వహిస్తున్నారా? అని ప్రజలు నిలదీస్తున్నారు. గతంలో సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి సిలిండర్లు సీజ్ చేసినా, మళ్లీ అదే చోట వ్యాపారం సాగుతుందంటేవారికి అధికారుల అండదండలు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. మున్సిపల్ అధికారులు తమ పరిధిలో జరుగుతున్న ఈ ప్రమాదకరమైన నిల్వలను ఎందుకు గుర్తించడం లేదని, తనిఖీలు చేయడంలో ఎందుకు వెనుకాడుతున్నారో నని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అశ్వారావుపేట నడిబొడ్డున పేలడానికి సిద్ధంగా ఉన్న ఈ గ్యాస్ ‘బాంబు’ను అధికారులు తక్షణమే తొలగించాలని, అన్నపూర్ణ మిల్లు పేరుతో సాగుతున్న ఈ కేంద్రాన్ని సీజ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మున్సిపల్ మరియు సివిల్ సప్లై అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా గతంలో నుండే గ్యాస్ కంపెనీ నడుస్తుందని, మున్సిపాలిటీ నుండి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదని, ఒకసారి పరిశీలిస్తామని తెలిపారు. అశ్వారావుపేట ఫైర్ ఆఫీసర్ ను వివరణ కోరగా సెలవులో ఉన్నామని, రాగానే పూర్తి వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. సివిల్ సప్లై డిటి ప్రభాకర్ ను వివరణ కోరగా గతంలో నిబంధనలకు విరుద్ధంగా 29 గ్యాస్ బండలను సీజ్ చేసిన మాట వాస్తవమేనని, సర్వీస్ పాయింట్ కు అవకాశం లేనప్పటికీ, వినియోగదారులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో సఖి పాయింటును నిర్వహిస్తున్నారని, ఏడు నుండి పది గ్యాస్ బండలు మాత్రమే నిల్వ ఉంచాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అంతకుమించి గ్యాస్ బండలు నిలవంచినట్లయితే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది గ్యాస్ ఏజెన్సీ కాదని, సఖి పాయింట్ మాత్రమే నిర్వహిస్తున్నారని, అసలైన గ్యాస్ ఏజెన్సీ వారికి కూడా చెప్పామని, ఈ సమస్యకు పరిష్కారం చూస్తామన్నారు. కేవలం వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఆలోచనతోనే సఖీ పాయింట్ నిర్వహిస్తున్నారన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఆలోచించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.