బహిరంగ చాలెంజ్ విసిరిన కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు
మన ప్రగతి న్యూస్ / దమ్మపేట :
దమ్మపేట మండల కేంద్రంలో ఎన్నికలు జరిగే తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ వేడి శీతాకాలంలో కూడా సెగలు పుట్టిస్తుంది. చాలెంజ్ లు బహిరంగ చాలెంజ్ లతో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థుల భర్తలు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణల అస్త్రాలు పరస్పరం సంధించు కుంటున్నారు. రెండు రోజుల క్రితం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి దారా రోహిణి భర్త దారా యుగంధర్ వీడియో రికార్డు రిలీజ్ చేసి దానిలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రమాదేవి భర్త పగడాల రాంబాబు అనే వ్యక్తి చాలామంది ఇళ్ల స్థలాలను కబ్జా చేశాడని, ఇలాంటి వ్యక్తులకు గ్రామ పంచాయతీని అప్పజెబితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, అందువలన పగడాల రాంబాబు సతీమణికి ఓట్లు వేయొద్దని ఓటర్లను కోరారు. దీనికి ప్రతిగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రమాదేవి భర్త పగడాల రాంబాబు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేస్తూ దానిలో ఆయన చాలా ఘాటుగా ప్రతి స్పందించారు. గ్రామపంచాయతీ వైస్ సర్పంచిగా చేసిన దారా యుగంధర్ రెండుసార్లు సస్పెండ్ అయ్యాడని, దమ్మపేట గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ సర్పంచ్ గాని ఏ ఉప సర్పంచ్ గాని రెండుసార్లు సస్పెండ్ అయిన దాఖలాలు లేవని అలాంటి ఘన చరిత్ర సాధించిన దారా యుగంధర్ భార్యకి ఓట్లు వేస్తే గ్రామపంచాయతీ తీవ్రంగా నష్టపోతుందని ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఎవరు అవినీతిపరులో, ఎవరు హత్యా రాజకీయాలు చేశారో. ఎవరు ఎన్ని భూములు కబ్జా చేశారో బహిరంగంగా ప్రజల మధ్యనే చర్చించుకుందాం దమ్ముంటే రా… అని దారా యుగంధర్ కు ఛాలెంజ్ విసిరిన పగడాల రాంబాబు. హత్యా రాజకీయాలు చేసింది నువ్వు. ఒక గిరిజనుడి భూమిని ఆక్రమించుకుంది కాక, ఆ గిరిజనుడిని చంపించాలని రౌడీలకు సుపారీ ఇచ్చింది నువ్వు కాదా? ఈ సందర్భంగా తమరు జైల్లో చెప్పకూడదు తినలేదా? ఎంతోమంది భూములను రిజిస్ట్రేషన్ చేయించు కుందే నువ్వు. గ్రామపంచాయతీ సొమ్ము లక్షల కొద్ది రూపాయలను మింగేసింది నువ్వు. ఎంక్వయిరీ చేసిన డిఎల్పిఓ సస్పెండ్ చేయడం నిజం కాదా? ఒకసారి కాదు రెండుసార్లు సస్పెండ్ అయిన ఘన చరిత్ర నువ్వు సాధించలేదా? దమ్మపేట గ్రామ ప్రజలు నువ్వు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు. చాలా తెలివైన ఓటర్లు. నువ్వు చేసే ప్రతి పనిని గ్రామ ప్రజలు చూస్తూనే ఉన్నారని ఈ ఎన్నికల్లో మీ అవినీతికి వ్యతిరేకంగా ఓట్లు వేయటం ఖాయమని ఆయన అన్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు… ఇన్ని అవినీతి ఆరోపణలు హత్యా రాజకీయాలు కలిగిన వ్యక్తి నాపై బురద సల్లాలని చూడటం చాలా నీచాతి నీచమైన రాజకీయం అని పగడాల రాంబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. దమ్మపేట గ్రామపంచాయతీలో ఉన్న విజ్ఞులు, మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు ఆలోచించి ఎటువంటి అవినీతి మరకలేని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పగడాల రమాదేవిని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి నిజాయితీ కలిగిన అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నామన్నారు.

