కీసరలో పెరుగుతున్న నిషేధిత మాంజా విక్రయాలు
మన ప్రగతి న్యూస్ / కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
కీసరలో నిషేధిత గాలిపటం మాంజా మరోసారి ప్రాణాంతకంగా మారింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడి మెడకు మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన పినింటి సుధాకర్ రెడ్డి కుమారుడు జశ్వంత్ రెడ్డి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో మెడపై లోతైన గాయం ఏర్పడగా, గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెడకు 19 కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని కీసర ప్రాంతంలో దుకాణదారులు దొంగచాటుగా నిషేధిత మాంజా విక్రయాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం ఓ వ్యక్తికి ముక్కుకు గాయం కాగా, మరో వ్యక్తికి కాలుకు మాంజా చుట్టుకొని గాయాలయ్యాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిషేధిత మాంజా విక్రయించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

