Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

‘అరైవ్ అలైవ్’తో ట్రాఫిక్‌పై అవగాహన

  • అదనపు డీసీపీ ఎన్. వెంకట రమణ

మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

వేములవాడలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి

ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి చేరాలనే ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’ అనే 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ అదనపు డీసీపీ ఎన్. వెంకట రమణ తెలిపారు. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ జోన్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజలందరిలో రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ చేరాలనే ఉద్దేశ్యంతో కాలనీలు, బస్తీలు, ప్రధాన కూడళ్లు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, కార్ డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, రాంగ్ సైడ్‌లో ప్రయాణించరాదని, అతివేగాన్ని నివారించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోందని, సిగ్నల్ జంప్ చేయరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యం వల్ల ఒక్క ప్రమాదంతో ఒక కుటుంబం భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాల పట్ల కూడా బాధ్యత వహించాలని సూచించారు. మీరు సురక్షితంగా ఇంటికి చేరాలని మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకోండి అని అన్నారు. ఈ సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, కుషాయిగూడ సీఐ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్సైలు సుధాకర్ రెడ్డి, వెంకన్నతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.