డోర్లు లేని మరుగుదొడ్లు.. శిథిల భవనం.. విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాలోని ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహం తీవ్ర పర్యవేక్షణ లోపంతో దయనీయ స్థితికి చేరింది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు స్లాబ్లు పెచ్చులూడుతూ ఎప్పుడైనా ప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొంది.వసతి గృహంలో ఉన్న మరుగుదొడ్లకు డోర్లు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుద్ధ తాగునీటి సౌకర్యం సమర్థంగా లేకపోవడంతో విద్యార్థులు ప్లేట్లలోనే నీరు తాగాల్సిన దుస్థితి నెలకొనడం గమనార్హం.ప్రస్తుతం ఈ హాస్టల్‌లో మొత్తం 50 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా, మౌలిక వసతుల కొరత కారణంగా కేవలం 30 మంది మాత్రమే నివసిస్తున్నారు. మిగిలిన విద్యార్థులు వసతి గృహంలో ఉండేందుకు ఆసక్తి చూపకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన విద్యార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వసతి గృహాన్ని మరమ్మతులు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


