మన ప్రగతి న్యూస్/శాయంపేట:
క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని మైలారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని మైలారం గ్రామానికి చెందిన కుక్కల రమేష్ కు కొడుకు అజయ్ (23) వున్నాడు. ఈనెల 25న రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో తన తండ్రి కుక్కల రమేష్, తన కొడుకు అజయ్ ను ఖాళీగా తిరగకుండా ఏదైనా పని చేసుకోమని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై అజయ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సమయం గడుస్తున్న ఇంకా ఇంటికి రాకపోవడంతో వెతకడానికి ద్విచక్ర వాహనంపై తన తండ్రి బయటికి వెళ్ళాడు. నల్లగుంట చెరువు దగ్గర రాత్రి 8 గంటల సమయంలో క్షణికావేశంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని, కాలిన గాయాలతో పడి ఉన్నాడు. కొడుకు అజయ్ ను తన తండ్రి రమేష్ చూసి బోరున విలపిస్తూ, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు తండ్రి రమేష్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు.

