Breaking News

ఏన్కూర్ లొ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ :

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఏన్కూరు మండలం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే జారీ చేశాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా నల్ల కండువాలు ధరించి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిట్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిరసన కార్యక్రమంలో మాట్లాడిన బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, నోటీసుల ద్వారా వేధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, ఆయనను లక్ష్యంగా చేసుకుని తీసుకునే చర్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సిట్ నోటీసులను వెంటనే రద్దు చేయకపోతే, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..