ఎస్.ఎస్.టీ చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
మన ప్రగతి న్యూస్/వేములవాడ ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎస్.ఎస్.టీ (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వాహనాల తనిఖీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు.తంగళ్ళపల్లి వంతెన, వెంకటాపూర్ బైపాస్, వేములవాడ మండలం అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన ఎస్.ఎస్.టీ చెక్ పోస్టులను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదివారం తనిఖీ చేశారు.సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్, ఇప్పటివరకు తనిఖీ చేసిన వాహనాల వివరాలపై ఆరా తీశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ తరలింపును అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి వాహన తనిఖీ వివరాలను స్పష్టంగా రిజిస్టర్లలో నమోదు చేయడంతో పాటు, వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించి, ఎన్నికల నియమావళిని నిక్కచ్చిగా అమలు చేయాలని ఆదేశించారు.ఈతనిఖీలో నోడల్ అధికారి గీత, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్, తదితరులు పాల్గొన్నారు.


