మన ప్రగతి న్యూస్ /చర్లపల్లి, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడిపిన గూడ్స్ వాహనం ఢీకొనడంతో నైట్ డ్యూటీకి వెళ్తున్న వ్యక్తి మృతి చెందిన ఘటన చర్లపల్లి పరిధిలో చోటుచేసుకుంది. పారుపల్లి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్న పారుపల్లి రామచంద్ర రెడ్డి (65) నైట్ డ్యూటీ నిమిత్తం తన నివాసం నుంచి బయలుదేరారు. బస్సులో ప్రయాణించి ఐ–కామ్ బస్ స్టాప్ వద్ద దిగిన అనంతరం, సుమారు 7:30 గంటల సమయంలో రోడ్డును దాటుతూ తన కంపెనీ వైపు వెళ్తుండగా, కేబుల్ ఎక్స్ రోడ్ నుంచి చర్లపల్లి వైపు వస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ (టిఎస్ 35 టిఎ 5981) డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఆయనను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రామచంద్ర రెడ్డి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర రక్తస్రావ గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా ఆయన్ను శ్రీకారా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 2:49 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

