నిందితులు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
మితిమీరిన వేగంతో కారును ఢీకొట్టడమే కాకుండా, అడ్డుగా నిలిచిన వ్యక్తిపైకి వాహనాన్ని నడిపి తీవ్రంగా గాయపరిచిన ఘటన మల్లాపూర్ ఎక్స్ రోడ్డు పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రాంపల్లికి చెందిన పనుగంటి రాజు, తన సహచరులు విజయ్ కుమార్, సతీష్‌తో కలిసి ఎంజీ విండ్‌సర్ కారులో మల్లాపూర్ నుంచి రాంపల్లికి వెళ్తున్నారు. మల్లాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన బోలెరో వాహనం (టి ఏస్ 09యఫ్ పి 0094) వీరి కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఆగకుండా వాహనాన్ని వేగంగా పోనివ్వడంతో, రాజు బృందం బోలెరోను వెంబడించింది. హెచ్.బి కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిగ్నల్ పడటంతో బోలెరో ఆగింది. ఈ క్రమంలో సతీష్ (45) వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా అతనిపైకి వాహనాన్ని పోనిచ్చాడు. దీంతో సతీష్ వెనుక భాగంలో తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం శ్రీకర రాఘవేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుల అరెస్ట్: బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. బాలాజీ నగర్‌కు చెందిన ఉప్పరి మహేష్ (23), అనగందుల తరుణ్ (22)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని శుక్రవారం (ఫిబ్రవరి 13) కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

