Breaking News

ఇటుక దందా.. ఇష్టారాజ్యం.!

  • పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలు
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం
  • ప్రభుత్వ ఆదాయానికి గండి.. పట్టించుకోని పాలకులు, అధికారులు
  • అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు
  • చెరువు, కుంటల నుంచి మట్టి తరలింపు
  • బాలకార్మికులతో పని చేయిస్తున్న వైనం
  • అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

మన ప్రగతి న్యూస్/
రఘునాథపల్లి:

నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు.ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు రోజుకో రీతిలో నూతన పంథా అవలంబిస్తూ అక్రమార్జనకు తెరలేపుతున్నారు.వీరికి అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకు గ్రామాల శివారు ప్రాంతాల్లో రహస్యంగా సాగిస్తున్న ఇటుక బట్టీలే ప్రత్యక్ష నిదర్శనం. గోరంత అనుమతులు పొంది కొండంత వ్యాపారం సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ ఇష్టానుసారంగా బట్టీలు ఏర్పాటు చేసి రేయింబవళ్లు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని ప్రజలు ఎప్పటినుండో అనుకుంటున్నారు. కొందరు అధికారులు వ్యాపారులతో చేతులు కలపడంతోనే సమీప చెరువుల్లోని సారవంతమైన మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలించి బట్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కళ్లెదుటే చెరువులు నాశనమవుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు.


రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొసున్న ఇటుక బట్టీలు కార్మికుల బతుకులను చిధ్రం చేస్తుండడంతో పాటు జీరో వ్యాపారం జోరుగా జరుగుతోంది. అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులు బట్టీ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలు ఉల్లఘించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

అంత మా ఇష్టం.. మనల్ని ఎవరు రా ఆపేది అనే తీరుగా అడ్డూ అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సాగుతుంది ఇటుక బట్టీల వ్యాపారం.భవన నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో రఘునాథపల్లి మండలంలోని గ్రామాలలో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. చాలా వరకు అనుమతులు లేకుండానే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి.
గ్రామంలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీల తయారీ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆ బట్టీలు ఊరికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం ఏర్పడి గ్రామంలోని వృద్ధులకు పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. గ్రామస్తులు భయాందోళనకు గురై గ్రామపంచాయతీ నుంచి కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. అయినా ఇటుక బట్టీల తయారీ కొనసాగుతూనే ఉంది. మండల స్థాయి అధికారులు వచ్చి చెప్పిన సంబంధిత యజమాన్యం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఫలితాలు చేసుకుంటూ పోతున్నారు.

ఇటుక బట్టీల నియమ నిబంధనలు….

ఇటుక బట్టీల ఏర్పాటుకు ఆయా గ్రామ పంచాయతీలతో పాటు రెవెన్యూ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలి.కానీ కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లోనూ బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే నాలా సుంకం చెల్లించాలి. కానీ రైతులకు డబ్బు ఎర చూపి నాలా సుంకం చెల్లించకుండానే వ్యాపారం చేస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తూ ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారు.
గ్రామ పంచాయతీ అనుమతి ఉండాలి. పబ్లిక్ ఇబ్బందులు కలిగే చోటు ఉండకూడదు. ఊరికి దూరంగా ఉండాలి. లేబర్ ఆఫీసర్ నుండి సర్టిఫికెట్ పొందాలి. విద్యుత్ శాఖ నుండి ట్రాన్స్ఫార్మర్ అనుమతి పొంది కమర్షియల్ మీటర్లు వాడాలి.
చెరువు మట్టి తీయాల్సి వస్తే రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల నుండి అనుమతి పొంది మట్టిని తీయవలసి ఉంటుంది.
ఇటుక బట్టీ తయారు చేసే భూమిని నాలా అనుమతి తీసుకోవాలి.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..!

ఇటుక బట్టీలు తయారు చేయడానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే.
కాని గ్రామాలలో నిర్వాహకులు ఏ ఒక్క నిబంధన కూడా పాటించడం లేదని గ్రామస్తులు ఆరోపణలు చేస్తూ,
అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం గుండు సున్నా అంటున్నారు.
గ్రామపంచాయతీ అనుమతి లేకుండా పెట్టిన ఇటుక బట్టీల తయారీదారులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ అధికారులు స్వయంగా పర్యవేక్షించినప్పటికీ బట్టీల యజమానుల పై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే అంతర్గతంగా అధికారులకు ఇటుక బట్టీ నిర్వాహకులకు ఒప్పందం కుదిరినట్లు విమర్శలు గ్రామస్తులు నుంచి వినిపిస్తున్నాయి.

ప్రధాన రహదారుల వెంట బట్టీలు…

మండలంలోని రహదారుల పక్కనే ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలికి బూడిద కొట్టుకువచ్చి కండ్లల్లో పడడం, ఇటుకు బట్టీల నుంచి వెలువడుతున్న పొగతో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, పర్యావరణ కాలుష్యము అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

బాల కార్మికులతోనూ పనులు….

ఇటుక బట్టీల వ్యాపారులు ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువస్తుంటారు. ఇందులో బాల కార్మికులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రతి ఇటుక బట్టీ వ్యాపారి వద్ద సుమారు నలుగురు నుంచి ఐదుగురు వరకు బాల కార్మికులు పని చేస్తుంటారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
లక్ష ఇటుకలు తయారు చేసే బట్టీల నిర్వాహకులు ట్రేడ్‌ లైసెన్స్ , వ్యాపార పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆపై తయారు చేసిన ఇటుకలను కాల్చేందుకు పొల్యూషన్ అధికారులతో అనుమతి పొందాలి. గ్రామ పంచాయతీతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, భూగర్భ, లేబర్ ఆఫీస్, విద్యుత్ శాఖ, అటవీశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఇటుక బట్టీల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి వలస కూలీలను తీసుకువచ్చి ఏళ్ల తరబడి వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. లక్షల్లో ఇటుకలు తయారవుతున్నా రాయల్టీ చెల్లించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటుక బట్టీల పై తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేని ఇటుక బట్టీల పై చర్యలు తీసుకొని, పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని సమకూర్చాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.