మన ప్రగతి న్యూస్ /వరంగల్
ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ హనుమంతరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, నన్నపనేని,బానోతు, మాజీ ఎమ్మెల్సీ పూల, మాజీ ఛైర్మన్ వీరమల్ల తదితర ప్రముఖులతో కలిసి కేసముద్రంలో ఏం.కే.ఫంక్షన్ హాలును ప్రారంభించారు.
ప్రధాని నరేంద్రమోడీ ఓబీసీనని చెప్పుకోవడమే తప్ప ఒరగబెట్టిందేమీ లేదని,కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని మాజీ ఎంపీ వీ.హనుమంతరావు అన్నారు.గత ప్రభుత్వాలు కులగణన ఎందుకు చేయలేదని అడుగుతున్న మోడీ, ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనే చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఏం.కే.కన్వెన్షల్ (మున్నూరుకాపు ఫంక్షన్ హాల్)హాల్ ప్రారంభోత్సవానికి వీహెచ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాంతాలు,రాజకీయాలకు అతీతంగా మనం పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని స్పష్టం చేశారు.బీసీలలోని ఇతర కులాల వారితో సఖ్యతగా మెలగడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈరోజు తనకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎంపీ వద్దిరాజు, శాసనసభ్యులు గంగుల ఆహ్వానించడంతో ఇక్కడకు రావడం జరిగిందన్నారు.మారుమూలన ఉన్న ఒక మండల కేంద్రంలో పెద్ద ఫంక్షన్ హాలు కట్టడం,ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం,ఈ సందర్భంగా బంధువులందరిని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.వేర్వేరు పేర్లతో పిలువబడుతున్నా కూడా మున్నూరుకాపు,తెలగ, కాపులు,బలిజ,తూర్పు కాపులంతా ఒకటేనని.. ప్రాంతాలకు అతీతంగా మన సంఘటిత శక్తిని నిరూపించుకోవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే గంటా చెప్పారు.భవిష్యత్ మనదేనని,రాజకీయాలను శాసించే రోజులు తప్పకుండా వస్తాయని శ్రీనివాసరావు ధీమా వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా ఆయన కేసముద్రం మున్నూరుకాపు సంక్షేమ సంఘానికి రూ.5లక్షలు విరాళంగా అందజేశారు.ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో మున్నూరుకాపు నాయకులు 9మంది ఎమ్మెల్యేలు ఉంటే,అదే ఇప్పుడు 3గురు మాత్రమే ఉన్నారన్నారు.మన జనాభా గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ రాజ్యాధికారం దక్కకపోవడం శోచనీయమన్నారు.అవసరమైన ప్రతి సందర్భంలో మన సంఘటిత శక్తిని చూపుద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి విశిష్ఠ అథితిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ,మనమందరం ఐకమత్యంతో ముందుకు సాగుతున్నామని చాటి చెప్పడానికి ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమమే మంచి ఉదాహరణ అన్నారు. మనం రూపొందించుకున్న బైలా ఇతర కుల సంఘాలు కూడా మార్గదర్శనంగా తీసుకున్నాయని వివరించారు.ఈ ఫంక్షన్ హాలును ఇంత మంచిగా నిర్మించడం, ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల చెందిన మన బంధువులకు ఆదర్శనీయమన్నాడు.మున్నూరుకాపులమైన మనం రైతు బిడ్డలం,పది మందికి అన్నం పెట్టే వాళ్లం,సాయపడేవాళ్లమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.పవన్ కళ్యాణ్ మాదిరిగా మన సంఘటిత శక్తిని నిరూపించుకుందామని, అవసరమైన ప్రతి సందర్భాన్ని సద్వినియోగం చేసుకుందామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.బీసీలలోని ఇతర కులాల వారితో స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ రాజ్యాధికారం వైపు వడివడిగా అడుగులేద్దామని పిలుపునిచ్చారు.ఫంక్షన్ హాల్ నిర్మాణానికి తమ వద్దిరాజు కుటుంబం సాయపడిందని,అవసరమయితే ఇక ముందు కూడా తోడ్పాటు అందిస్తామని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్,బానోతు శంకర్ నాయక్,మున్నూరుకాపు ప్రముఖులు వీ.ప్రకాష్,సీ.విఠల్,కొండా దేవయ్య, వద్దిరాజు కిషన్, సర్థార్ పుటం పురుషోత్తమ రావు,రౌతు కనకయ్య,పారా నాగేశ్వర్ రావు,దిండిగాల రాజేందర్,ఆర్జేసీ కృష్ణ,దుర్గం రవీందర్,ఆకుల గాంధీ,డాక్టర్ బీఏల్ఏన్ పటేల్,ఆకుల రజిత్,మరికల్ పోత సుధీర్ కుమార్,కొత్త సీతారాములు తదితరులు హాజరై ప్రసంగించారు.కేసముద్రం మున్నూరుకాపు సంక్షేమ సంఘానికి రౌతు కనకయ్య లక్షా పదివేల రూపాయలు విరాళంగా అందించారు.మంగళవాయిద్యాలు,వేద పండితుల మంత్రోచ్ఛరణాలు,హోమం,పూజలతో ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.మున్నూరుకాపు సంఘం కేసముద్రం శాఖ ప్రముఖులు చందా గోపి,కమటం స్వామి,సింగంశెట్టి ఏకాంతం తదితరులు అతిథులకు పుష్పగుచ్ఛాలిచ్చి శాలువాలతో సత్కరించారు, జ్ఞాపికలు అందించారు
ఈ సందర్భంగా వేదికపై ప్రముఖులంతా చేయిచేయి కలిపి అభివాదం చేస్తూ మున్నూరుకాపుల ఐక్యతను చాటి చెప్పారు.