Breaking News

గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో భోజనంపై విద్యార్థినిలు రోడ్డు పై ధర్నా

మాకు న్యాయం జరిగేవరకు రోడ్డు పై కూర్చున్న విద్యార్థినిలు

ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ఎమ్మెల్యే సందర్శనతో ఆందోళన విరమించిన విద్యార్థినిలు

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో సరైన భోజనం అందించడం లేదని, మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, నీళ్ల చారు పురుగులతో కూడిన భోజనం అందిస్తున్నారని, పలు రోజులుగా సమస్యను తెలియజేసినా పరిష్కారం కాలేదని విద్యార్థినులు తమ ఆరోగ్యం దెబ్బతింటోందని, చదువుపై కూడా ప్రభావం పడుతోందని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోవడంతో విద్యార్థినిలు తమకు న్యాయం జరిగే వరకూ సంబంధిత అధికారులు స్పందించేంతవరకు ఊరుకునేది లేదని పాలకుర్తి నుండి హనుమకొండ కు వెళ్లే రహదారిపై ధర్నా నిర్వహించిన సంఘటన సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో గ్రామంలో చోటుచేసుకుంది.ఈ విషయం స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి దృష్టికి వెళ్లగా వెంటనే స్పందించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించిన నేరుగా విద్యార్థినులతో సమావేశమై వారి సమస్యలను ఒక్కో విద్యార్థినితో మాట్లాడి భోజన నాణ్యత, మెనూ అమలు,వసతి సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకు
న్నారు.అనంతరం హాస్టల్ వంటశాలను పరిశీలించి, ఆ రోజు సిద్ధం చేసిన భోజనాన్ని తనిఖీ చేశారు. బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, సరఫరా రికార్డులు, హాజరు పట్టికలు తదితర పత్రాలను కూడా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించడంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి గూడూరు హాస్టల్ పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియజేశారు. విద్యార్థినులకు నాణ్యమైన, పోషకాహారం అందించడం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. తక్షణమే విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యం, చదువు విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ప్రభుత్వ పథకాల అసలు ఉద్దేశ్యం విద్యార్థుల సంక్షేమం. అందుకు అనుగుణంగా హాస్టళ్లలో ఆహారం, వసతి, పరిశుభ్రత విషయంలో ప్రమాణాలు తప్పక పాటించాలి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇకపై హాస్టల్ నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఎమ్మెల్యే హాస్టల్ ను సందర్శించడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రత్యక్షంగా విని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఆహార నాణ్యత, నిర్వహణ విధానంపై అధికార యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యార్థినుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఇతర హాస్టళ్లకు కూడా మార్గదర్శకంగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు సరైన సమయంలో భోజనం అందించకపోవడంతో పాటు నీళ్ల చారు పురుగుల అన్నం వడ్డిస్తున్నారని ఆరోపించారు. ఒక్కొక్క రోజు 4 గంటల సమయంలో భోజనం అందిస్తున్నారని అది కూడా ఉడికి ఉడకని భోజనమే అందిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సందర్శన లో ఆర్డీవో డిఎస్ వెంకన్న,సీఐ జానకి రామ్ రెడ్డి, తాహిసిల్దార్ సరస్వతి, గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.