మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్:
జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట విధానం, పరిశుభ్రత, పోషకాహార పట్టిక అమలు విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన చైర్మన్ వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పసిపిల్లలకు సమయానికి, నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం సరైన మోతాదులో, పరిశుభ్ర వాతావరణంలో వండి అందించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్ మరియు ఆయమ్మలతో సమావేశమై చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు, ఆరోగ్య రికార్డులు సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే పోషకాహారం కూడా నాణ్యతతో ఉండాలని, కేంద్రానికి వచ్చే ప్రతి లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..అంగన్వాడీ భవనం పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, శౌచాలయాల నిర్వహణ, వంటగది పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు ఉంటే వెంటనే నివేదించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే బాల్యంలోనే సరైన పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ చుంచు రమ చింతల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ తదితర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషణ, శ్రేయస్సు పట్ల మున్సిపల్ యంత్రాంగం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ స్పష్టం చేశారు.


