Breaking News

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: మానవ తప్పిదమే..

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ అలాగే మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల ఈ ఘటనపై రక్షణ శాఖ స్థాయి సంఘం తన నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టింది.

స్థాయి కమిటీ నివేదిక ప్రకారం, హెలికాప్టర్ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని స్పష్టమైంది. పైలట్ నిర్ణయాల్లో వచ్చిన లోపాల వల్ల ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు నివేదిక తెలిపింది. 2017-2022 మధ్య భారతీయ వైమానిక దళానికి చెందిన మొత్తం 34 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటిలో 2021-2022లో జరిగిన 9 ప్రమాదాల్లో, జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం మానవ తప్పిదానికి తార్కాణమని తేల్చారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

కూనూరులో జరిగిన ఈ ప్రమాదం అప్పట్లో దేశం మొత్తాన్ని కదిలించింది. జనరల్ బిపిన్ రావత్ భారతదేశ మొదటి త్రివిధ దళాధిపతిగా దేశ రక్షణ వ్యవస్థకు చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రముఖులు పేర్కొన్నారు. ఈ నివేదికతో ఈ ప్రమాదం వెనుక కారణాలు బయటపడటమే కాకుండా, రక్షణ వ్యవస్థలో మెరుగుదల కొరకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిపోర్టు ప్రకారం, ఈ ప్రమాదం తర్వాత హెలికాప్టర్, విమానాల నిర్వహణకు సంబంధించి రక్షణ శాఖ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక శిక్షణ, నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.