Breaking News

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికే కేటాయించాలి

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో భూ, అట్రాసిటీ సమస్యలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, సాంఘిక సంక్షేమ శాఖ, డి ఆర్ డి ఓ జడ్పీ సీఈవో, ట్రైబల్ వెల్ఫేర్, సంక్షేమ గృహాల శాఖల మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ముందు గా కాన్ఫరెన్స్ హాలులో ప్రజా కవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా కాళోజి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, చిత్రపటాలకు పూలను జల్లి అంజలి ఘటించారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి


సమావేశానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మొక్కను అందజేసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి పురోగతి వివరాలను. జిల్లా ఎస్పీ, కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పలు భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల గురించిన వివరాలను కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ఛైర్మన్ ను కోరారు.
ఈ సందర్భంగా భూ వివాదాలకు సంబంధించిన కేసులు, అట్రాసిటీ కేసుల పరిష్కారం ఎన్ని రోజుల్లో జరుగుతుందని తొర్రూరు మహబూబాబాద్, ఆర్డీవోలు, గణేష్ కృష్ణవేణి,పోలీస్ అధికారులను ఛైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎంతమంది బాధితులకు పరిహారం అందిందని వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నర్మదను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో దళితుల భూమి సమస్యకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక ను తమకు అందజేయాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే తప్పకుండా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు. గ్రామాలలో నిర్వహించే సివిల్ రైట్స్ డే కు అన్ని కులాలు హాజరయ్యేలా అధికారులు చూడాలన్నారు. సివిల్ రైట్స్ డే నిర్వహణ కు సంబంధించి సంవత్సర కాలానికి తహసీల్దార్, ఎస్సై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సివిల్ రైట్స్ డే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా భూ సమస్యలు, మూఢనమ్మకాలు, తదితర సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. భూముల సమస్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలన్నారు. బాధిత ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అందరికీ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ లో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మెస్ చార్జీలు పెంచినందుకు ముఖ్యమంత్రికు ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ లో ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధ కమీషన్ అని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే ఎస్సీ ఎస్టీల సమస్యలను పోలీసులు ఓపికగా వినాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహపూర్వక పోలీసింగ్ ను అమలు చేస్తున్నారని అన్నారు. అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉండకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలతోనే ఎస్సి, ఎస్టి లకు సంబంధించిన భూవివాద సమస్యలు, అట్రాసిటీ కేసులకు పరిష్కారం లభిస్తుందని, జిల్లాలోని యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చదువుపై ఆసక్తి కలిగేందుకు అవగాహన కల్పించాలని, జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, ఎస్సీ ఎస్టీల భూములను కబ్జాలు కాకుండా పరిరక్షించాలని, పరిశ్రమల శాఖ పెండింగ్లో ఉన్న పథకాల అమలు పెండింగ్ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన కేసులపై తహసీల్దారుల నుండి ప్రాథమిక నివేదికలు అందాయని, వాటిపై 15 రోజులలో సమగ్ర నివేదికను కమిషన్ కు అందజేస్తామని, జిల్లాస్థాయిలో వసతి గృహాల నిర్వహణ, విద్యా, వైద్యం అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారం తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, తొర్రూరు, మహబూబాబాద్ ఆర్డిఓ గణేష్, కృష్ణవేణి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నునావత్ రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు, గుండాల నరసయ్య, కే.సంజీవరావు, పి సుధాకర్, గుగులోతు కిషన్ నాయక్, పి.అశోక్ కుమార్, అడిషనల్ ఎస్పీ చేన్నయ్య, జెడ్పి సీఓ పురుషోత్తం, డిఆర్డిఓ మధుసుదన్ రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, డిహెచ్ఓ మరియన్న, సిపిఓ సుబ్బారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహస్వామి, డిపిఓ హరిప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.